అప్పటికి నాలుగు రోజులైంది లాప్ టాప్ మూసేసి. ఆ నాలుగు రోజులు తిరుగుతూనే ఉన్నా, నన్ను నేను మరిచిపోయే అందాల్ని చూస్తూ. బాగా అలిసిపోయా తిరిగి తిరిగి రూమ్ కొచ్చేసరికి. టైం రాత్రి 8 దాటింది. ఏం చేయాలో అర్ధం కాక అలా కిటికీ లోంచి చూస్తూ ఉన్నా. ఇంకా చీకటి పడలేదు. ఆ కనపడే తెల్లటి మంచు కొండలకి, సూర్యుడు తన కిరణాలతో పొద్దున్న నుండి వేసిన మేకప్ ఇంకా పోనే లేదు. అప్పుడే ప్యాకప్ చెప్తూ… బులుగు మబ్బుల మధ్య నుండి , అసురసంధ్య ఎర్రగా కిందకి దిగటానికి రెడీ అవుతుంది. చిన్నప్పుడు కేలండర్ పేజీల్లో చుసిన ఇమేజెస్ ని, ఇలా లైవ్ లో చూసి కళ్ళలో నింపుకుంటున్న ఆనందం నాది ఆ క్షణం .
అంతలో, దూరంగా కుండీ లో కలర్ ఫుల్ గా ఉన్న పూలమొక్క నా అటెంషన్ లాగింది. దాని వంక ఒక ఇంటరెస్ట్ తో అలానే చూస్తూనే ఉన్నా (అప్పటి దాకా చుసిన విజువల్స్ ని రీక్యాప్ చేసుకుంటన్నట్టు). అంతలోనే నా చూపుని డిస్టర్బ్ చేస్తున్నట్టు, శత్రువు ఏదో యుద్ధం ప్రకటించినట్టు, ఆ పూల మొక్కని శిధిలం చేయాలని పగబట్టినట్టు, ఆ వింటేజ్ హౌస్ చూరు నుండి కారే నీటిబొట్టు అమాంతం ప్రతి రెండు సెకండ్స్ కి కిందకి దూకుతుంది. ఆ రోజే విచ్చుకున్న ఆ పువ్వు మీద ఒక వాటర్ డ్రాప్ చేసే దాడి అది. కళ్ళకి జూమ్ ఆప్షన్ లేదు కాబట్టి, దగ్గరగా వెళ్లి చూడటం స్టార్ట్ చేశాను. తనలో దాచుకున్న సైన్యాన్ని ఆ ఇంటి పైకప్పు, ప్రతి కొద్దీ సెకండ్స్ కి ఒక్కొక్కటిగా, ఒక్కో చినుకుగా పంపిస్తున్నట్టు అనిపించింది. అంత దాడినీ ఆ ఒక్క చిన్న పువ్వే తట్టుకుంటుందా అనిపించింది.
కానీ అంతలోనే, ఆ పువ్వు మీద జాలి తగ్గి, సరదా స్టార్ట్ అయింది. నా ఆలోచన మారింది. దూకుడు గా పడే ప్రతి చినుకు, ఆ పువ్వుని కిందకి తొక్కుతుంటే, తిరిగి ఉత్సాహంగా ఎగిరి గెంతుతూ పైకి లేస్తుంది. ఇంటరెస్ట్ పెరిగి, ఇంకాస్త స్లోమోషన్ లో గమనించటం స్టార్ట్ చేశా. ఇకపై ఆ చినుకుది యుద్ధం అనిపించలేదు. ఆ రెండు ఆడుకునే ఆట లాగా అనిపించింది. చినుకు పెట్టే చక్కిలిగింత అనిపించింది. దానికి ఆ పువ్వు సిగ్గుతో తిరిగే మెలికల్లాగా అనిపించింది. ఎప్పటికి కలవలేని ఆ రెండు, ఇది నిరంతరం ఆడుకునే ఆట లాగా అనిపించింది. మన(మనిషి) జాతి కాని ఒక రెండిటిని కాసేపు కలిపి చూస్తే.. సగం సేపు యుద్ధం కనపడింది…ఇంకొంచెం సేపు ప్రేమ/స్నేహం కనిపించింది. ఆ కొద్దిసేపట్లో ప్రణయాన్ని చూసాను…ప్రకృతి ప్రయాణాన్నీ చూసాను. ప్రకృతిలో రెండు సంబంధం లేని విషయాల కలయిక కూడా ఇంత బాగుంటదా అనిపించింది.
ఇవాళ రేపు, ఎటు చూసినా బూతే మార్గం… అందులో ఎలాంటి సెన్సిబిలిటీస్ కి స్కోప్ లేదు. కానీ నేను చూసేది భూతల స్వర్గం. స్వర్గం అంటే, నేను చెప్తుంది పైన జరిగిన సంఘటనని చిత్రించిన స్విట్జర్లాండ్ గురించి కాదు. వాటిని స్లో మోషన్ ని ఆస్వాదించే నా ‘మనసు’ గురించి, అందులోంచి క్రియేట్ అయ్యే నా ‘మెమోరీస్’ గురించి.
నిరంతరం పరిగెత్తే వాళ్ళకి, ఈ స్లో మోషన్ ఎపిసోడ్ అంతా, సోది లాగానో, లేకపోతే ఏదన్నా స్లో సాంగ్ లో వాడుకునే raw footage లాగానో తప్ప, అందమైన ప్రకృతి చర్య లాగా అనిపించదు. పరిగెత్తే క్రమంలో ఆగమయ్యాం…ఆగి చూడటం మర్చిపోయాం. టైం అయిపోతందని పరిగెత్తే సిట్యుయేషన్ లోనే రోజంతా ఉంటూ… ఆ హడావిడిలో అమ్మ, భార్య నోట్లో పెట్టే ముద్ద రుచి గురించి మాట్లాడ్డం మర్చిపోయాం. ఇన్నాళ్ల మన experience లో మనం యే workaholic నో , alchoholic నో అయ్యాం తప్ప, అసలు మనల్ని మనం ఎక్కడ వెతుక్కున్నాం, ఎంత అర్ధం చేసుకున్నాం. ఒంటరితనాన్ని ఎక్కడ ఆస్వాదించాం. కుర్ర వయసు గోల్ అంతా అప్సరస ని దక్కించుకోవాలనే కానీ, చీకటిని దాటి అసలు ఆ అందాన్ని ఆస్వాదించే వాత్సాయనులెంతమంది. హాలిడే కెళ్ళటం అంటే నాలుగు రోజులు తిరిగి రావటం కాదు, మళ్ళీ బతికి రావటం… మనిషిగా..!! మర్చిపోలేని గుర్తులతో…!!!
Comments are closed